
చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామ రెమెన్యూ పరిధిలో గురువారం మైనింగ్ కాలపరిమితి పెంపు నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెదనడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 29పి, 30/2పి, 30/3పిలో ఇది వరకు పరమేశ్వరి మైన్స్ పేరుతో జరుగుతున్న మైనింగ్ కాలపరిమితిని పెంచాలని కోరుతూ సర్వాగీ కంపెనీ ఇటీవల మైనింగ్ శాఖను కోరింది. ఇందుకు సంబంధించి పర్యావరణ అనుమతులు తప్పనిసరి కావటంతో సంబంధిత సంస్థ అధికారులను కోరింది. దీంతో జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమక్షంలో మైనింగ్ ఆవరణలో గురువారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పెదనడిపల్లి, పేరిపి, ఇటకర్లపల్లి గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ మైనింగ్ ఏర్పాటు వలన పరిసర ప్రాంతాల్లో తోటలకు, పంటలకు కొంత ఇబ్బంది కలగటంతో నష్టపోతున్నామని, బోర్లులో నీటి సమస్య ఎదురవుతుందని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పంటలకు నష్టం వాటిల్లినప్పుడు కొంత పరిహారం చెల్లించాలని కొంత మంది అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలు రాకుండా మైనింగ్ చేసుకోవాలని అభిప్రాయాలను తెలియజేశారు. మైనింగ్ నిర్వహణలో తమ గ్రామాలకు చెందిన వారికే ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఇందులో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు విద్యా వసతులు కల్పించాలని, తమ గ్రామాల అభివృద్ధికి సహకరించాలని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ అశోక్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయం మేరకు పనుల నిర్వహణకు ముందుక వెళ్తామని, ప్రజల కోరిన అభిప్రాయాలను నెరవేరుస్తామని తెలిపారు. జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఆ మేరకు ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ మైనింగ్ చేసుకోవాలని మైనింగ్ వారికి సూచించారు.