ధ‌ర్నా చౌక్ ఎత్తేసి ప్ర‌జ‌ల గొంతును నొక్కిన బీఆర్ఎస్‌కు ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడే అర్హ‌త ఉందా?: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • రైళ్ల కేటాయింపులో కేంద్రం వివక్ష తగదు
  • కేంద్రంలో నిర‌స‌న‌ల‌కు ఆటంకం క‌ల్పిస్తున్న వారే రాష్ట్రంలో పాద‌యాత్ర‌లు చేస్తున్నారు
  • ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం..
  • కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్‌: ప్రజాస్వామ్యం, నిరసన తెలిపే హక్కుల గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు గతంలో తమ పాలనలో అనుసరించిన విధానాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు, వారి భాష, హావభావాలు బాధాకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. గతంలో నిరసనలు, ధర్నాలకు అవకాశం లేకుండా ఇందిరాపార్క్‌లో ధ‌ర్నా చౌక్‌ను ఎత్తివేసిన వారే ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బుధ‌వారం నాడు స‌చివాల‌యంలో మీడియా స‌మావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నాచౌక్‌ను పునరుద్ధరించి, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. గతంలో నిరసన తెలిపిన వారిని అణచివేయడం, నోరు మూయించే ప్రయత్నాలు చేయడం వంటి చర్యలకు పాల్పడినవారు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని హితవు పలికారు.

ఓటు హక్కు పరిరక్షణే కాంగ్రెస్ ప్రధాన డిమాండ్
న‌వంబ‌ర్ 2న హైద‌రాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాద‌యాత్ర‌పై మంత్రి స్పందిస్తూ కేంద్రంలో నిరసనలకు ఆటంకాలు కల్పిస్తూ, తెలంగాణలో పాదయాత్రలు చేపట్టాలని బీజేపీ నాయకులు భావించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా తన అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవచ్చని, పాదయాత్రలు నిర్వహించవచ్చని తెలిపారు. అయితే అదే స్వేచ్ఛను ఇతర పార్టీలకు కూడా కల్పించాలన్నదే తమ అభిప్రాయమని స్పష్టం చేశారు.ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలని, నిరసన తెలిపే హక్కును గౌరవించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల ఓటు హక్కును తొలగిస్తున్నారనే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోందని మంత్రి తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ఓటర్లకు ఎదురవుతున్న సమస్యలపై సమగ్ర పునఃపరిశీలన జరిపి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు.

ఈ అంశంపై గత నాలుగు, ఐదు నెలలుగా ఢిల్లీ కేంద్రంగా వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టినా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడం లేదని విమర్శించారు. ఎన్నికల ప్రధాన కమిషనర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆయన రాజీనామా చేసేలా చూడాలని లేదా చట్టప్రకారం పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు. ఓటు హక్కు కోల్పోయిన అర్హులైన పౌరులందరి వివరాలను పునఃపరిశీలించి, వారికి తిరిగి ఓటు హక్కు కల్పించే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఢిల్లీ ర్యాలీకి రైళ్లు కేటాయించకపోవడం సమంజసం కాదు
ఓటు హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన ఆందోళనలో భాగంగా న‌వంబ‌ర్ 1న ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పిలుపునిచ్చాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రైల్వే బోగీలు కేటాయించాలని కోరినా కేంద్రం అనుమతులు ఇవ్వ‌డం లేద‌ని విమర్శించారు. గత పది రోజులుగా తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇండియా కూటమి నేతలు, కార్యకర్తలకు రైళ్ల కేటాయింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయ కార్యక్రమాలకు రైళ్లను కేటాయించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. రైల్వేలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సొత్తు కాదని, అవి భారత ప్రజల ఆస్తి అని మంత్రి స్పష్టం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలని, ప్రజాస్వామ్యబద్ధమైన కార్యక్రమాలకు అవసరమైన రవాణా సదుపాయాలను కల్పించాలని కోరారు.

కేంద్ర సంస్థల వ్యవహారాలపై ఆధారాలతో ప్రశ్నిస్తాం
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియతో పాటు రైల్వే శాఖ వ్యవహారాలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్ణయాలపై తమ పార్టీ ప్రశ్నలు లేవనెత్తుతోందని మంత్రి తెలిపారు. ప్రజలకు సంబంధించిన అంశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆధారాలతో ప్రజల ముందుంచుతామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలను అడ్డుకోవడం, రాజకీయ కార్యక్రమాలకు ఆటంకాలు కల్పించడం వంటి చర్యలపై ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.