- ప్రభుత్వ ఉద్యోగులు ఆధునిక సాంకేతికతలో అప్డేట్ కావాలి
- ఏఐతో ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించాలి
- కార్యాలయాల్లో ఆదా అయ్యే సమయం ప్రజలకు తిరిగి అందాలి
- ‘ఏఐ సాక్షమ్’ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కృత్రిమ మేధస్సు (ఏఐ)పై అవగాహన పెంపొందించుకుని, తమ రోజువారీ విధుల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రణాళికా శాఖ, టీజీ మ్యాథ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న ఏఐ శిక్షణను సద్వినియోగం చేసుకుని, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఏఐ వినియోగం వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు వేగవంతం కావడంతోపాటు, సామాన్య ప్రజల సమస్యలు సకాలంలో పరిష్కారం కావాలి. కార్యాలయాల్లో ఆదా అయ్యే సమయం ప్రజలకు మెరుగైన సేవల రూపంలో తిరిగి అందాలి. ప్రజల జీవితాల్లో కనిపించే సానుకూల మార్పే ఏఐ వినియోగానికి అసలైన గీటురాయి అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రణాళికా శాఖ సహకారంతో టీజీ మ్యాథ్ చేపట్టిన ‘ఏఐ సాక్షమ్’ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాలను పెంపొందించి, పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. సాంకేతికతలో వస్తున్న మార్పులను ఉద్యోగులు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని, శిక్షణ ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగించాలని సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో రోజువారీగా నిర్వహించే పనులను మరింత వేగంగా, సమర్థంగా పూర్తి చేసేందుకు ఏఐ సాధనాలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను గుర్తించడం, నివేదికలను రూపొందించడం, సమాచారాన్ని విశ్లేషించడం, ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరాలు అందించడం వంటి పనుల్లో ఏఐ ద్వారా సమయం ఆదా చేయవచ్చన్నారు. శిక్షణలో ఉద్యోగులు చురుగ్గా పాల్గొని, తమ విధులకు అనుగుణంగా ఏఐ సాధనాలను ఉపయోగించే పద్ధతులను నేర్చుకోవాలని కోరారు. ఒక రైతు దరఖాస్తు త్వరగా పరిష్కారం కావడం, పింఛనుదారుడికి తనకు అందాల్సిన ప్రయోజనాలపై స్పష్టమైన సమాచారం లభించడం, ఒక పౌరుడు తన పని కోసం పదేపదే ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తగ్గడం వంటి మార్పులు సాంకేతికత వినియోగం ద్వారా సాధ్యపడాలని పేర్కొన్నారు. ఉద్యోగులు ఆదా చేసిన సమయాన్ని ప్రజల సమస్యలను మరింత శ్రద్ధగా పరిశీలించేందుకు, సేవల నాణ్యతను పెంచేందుకు వినియోగించాలని సూచించారు.
ఆర్థిక, ప్రణాళికా రంగాల్లో మెరుగైన ఫలితాలు
ప్రజాధనం వినియోగాన్ని విశ్లేషించడం, ప్రాజెక్టుల వ్యయాలను పోల్చడం, పనుల అమలులో జాప్యాలకు కారణాలను గుర్తించడం వంటి అంశాల్లో ఏఐ ఆధారిత సాధనాలు అధికారులకు సహాయపడగలవని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ వనరులను సమర్థంగా వినియోగించుకోవడానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలును మెరుగ్గా పర్యవేక్షించడానికి ఈ సాంకేతికతను ఉపయోగించుకోవచ్చన్నారు. ప్రణాళికా రంగంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలు ఎలా అందుతున్నాయో విశ్లేషించడం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారందరికీ చేరుతున్నాయా అనే అంశాలను పరిశీలించడం ద్వారా మెరుగైన ప్రణాళికలు రూపొందించవచ్చని తెలిపారు. గణాంకాలతోపాటు క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
విద్యుత్ రంగంలోనూ ఏఐతో ప్రయోజనాలు
విద్యుత్ డిమాండ్‌ను ముందుగానే అంచనా వేయడం, పరికరాల్లో తలెత్తే లోపాలను గుర్తించడం, నిర్వహణ చర్యలను మెరుగుపరచడం వంటి అంశాల్లో ఏఐ ఉపయోగపడుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం ద్వారా విద్యుత్ నిర్వహణను మెరుగుపరిచి, రైతులు, పరిశ్రమలు, ఆసుపత్రులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
ఏఐ సాధనాలను ఉపయోగించే సమయంలో సమాచార భద్రత, కచ్చితత్వం, బాధ్యతకు ప్రాధాన్యమివ్వాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అనుమతి లేని సాధనాల్లో అధికారిక లేదా వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయరాదన్నారు. ఏఐ రూపొందించిన సమాచారాన్ని అధికారిక రికార్డుల్లో చేర్చే ముందు, నిర్ణయాలకు ఆధారంగా ఉపయోగించే ముందు అధికారులు ధ్రువీకరించాలని సూచించారు. సాంకేతికత సహాయంతో పనులు నిర్వహించినప్పటికీ తుది నిర్ణయాలు, వాటికి సంబంధించిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు.ప్రతి శాఖలో ఏఐ వినియోగానికి అనువైన పనులను గుర్తించి, ముందుగా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సూచించారు. ఫలితాలను పరిశీలించి, ప్రజలకు కలిగే ప్రయోజనం, పనితీరు, కచ్చితత్వం ఆధారంగా విస్తరణ చేపట్టాలని తెలిపారు.ప్రణాళికా శాఖ, టీజీ మ్యాథ్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ శిక్షణను ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒక అవకాశంగా భావించి సద్వినియోగం చేసుకోవాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై నిరంతరం అవగాహన పెంపొందించుకుంటూ, నేర్చుకున్న నైపుణ్యాలను విధుల్లో ఆచరణాత్మకంగా వినియోగించాలని కోరారు. మరింత సమర్థులైన ఉద్యోగులు, వేగవంతమైన ప్రభుత్వ సేవలు, ప్రజలకు మెరుగైన ఫలితాలు—ఇదే ‘ఏఐ సాక్షమ్’ కార్యక్రమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, డిప్యూటీ సీఎం సెక్రటరీ, ట్రాన్స్‌కో సీఎం డి కృష్ణ భాస్కర్, టీజీ మ్యాథ్ ఎండి పూజ, ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి డైరెక్టర్ జనరల్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
