నేటినుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌గా తమిళి సై బాధ్యతలు చేపట్టిన అనంతరం జరుగుతున్న తొలిసమావేశాలు ఇవే. గవర్నర్ తమిళిసై ఉభయసభలను ఉద్ధేశించి తెలంగాణ సాధించిన అభివృద్ధి, సాధించాల్సిన లక్ష్యాలను పేర్కొననున్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి వర్గం గవర్నర్ ప్రసంగాన్ని రూపొందించింది, గవర్నర్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మండలి సభ్యులకు ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బిఎసి) సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సిఎం కెసిఆర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్బరుద్ధీన్ ఒవైసి, శాసనసభలో కాంగ్రెస్ పక్షనాయకుడు మల్లు భట్టివిక్రమార్క, బిజెపి సభ్యుడు రాజాసింగ్ తదితరులు పాల్గొని శాసనసభ పనిదినాలను నిర్ణయిస్తారు. అలాగే ఈ బడ్జెట్ సమావేశాల్లో సిఎం కెసిఆర్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశపెట్టనున్నారు. అలాగే లోకాయుక్త బిల్లును చట్టసభ ఆమోదానికి ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు నూతన మున్సిపాలిటీ చట్టాన్ని జిహెచ్‌ఎంసికి అనుసంధానిస్తూ ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనుంది. అలాగే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణం అనంతరం ఈ నెల 8న రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి హరీష్‌రావు శాసనసభలో బడ్డెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.