అసెంబ్లీ రేపటికి వాయిదా

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా, ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రసంగించారు. సుమారు 40 నిమిషాల పాటు గవర్నర్‌ తన ప్రసంగాన్ని చదివి వినిపించారు. ప్రసంగం ముగిసిన అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రేపు సభలో చర్చ జరగనుంది.
శాసనసభ, మండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేయడానికి మరికాసేపట్లో బీఏసీ సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం 14 పని దినాలకు తగ్గకుండా సమావేశాలు జరగనున్నాయి. ఎన్ని రోజులు, ఎన్ని గంటల పాటు సమావేశాలు జరగాలన్నది కూడా బీఏసీ నిర్ణయించనున్నది.