
నారాయణపేట జిల్లాలోని మద్దూరు తహసీల్దార్ కార్యాలయంపై అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. భూమికి సంబంధించిన విషయంలో పేరు మార్పు కోసం రైతు దరఖాస్తు చేసుకోగా చెన్నారం గ్రామ వీఆర్వో అనంత పద్మనాభం రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. రైతు బతిమాలడంతో రూ.8 వేలు తీసుకోవడానికి అంగీకరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ రోజు పద్మనాభం తహసీల్దారు కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు ఇందులో ఇంక ఎవరెవరి పాత్ర ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.