
ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ధి కల్పనకు సంస్థ హామీ,
విజయనగరం జిల్లా గుర్ల మండలం సదానందపురం గని విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ శుక్రవారం జరిగింది. ఇందులో పర్యావరణానికి, ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా మాంగనీసు గనిని విస్తరించండి. ఉపాధి అవకాశాలను మెరుగు పరిచి, అభివృద్ధికి యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలంటూ ప్రభావిత ప్రాంత ప్రజలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గుర్ల మండలం సదానందపురం పరిధిలో ఆర్బీఎస్ఎస్ డీఎఫ్ఎన్ దాస్ మైనింగ్ సంస్థ తవ్వకాలు చేస్తున్న మాంగనీసు గనిలో ఉత్పత్తులను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి శుక్రవారం నిర్వహించింది. జిల్లా సంయుక్త కలెక్టర్-2 ఆర్. కూర్మనాథ్, కాలుష్య నియంత్రణ మండలి అధికారి సుదర్శన్ సదస్సులో పాల్గొని పరిసర గ్రామల ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ముందుగా మైనింగ్ సంస్థ మేనేజర్ విశ్వనాధ నాయుడు మాట్లాడుతూ సదానందనపురం రెవెన్యూ పరిధిలో 56.83 హెక్టార్ల ప్రభుత్వ భూములను తమ సంస్థ లీజుకు తీసుకుని మాంగనీసు తవ్వకాలను జరుపుతోందని తెలిపారు. ప్రస్తుతం 22 వేల మెట్రిక్ టన్నులకు అనుమతులున్నాయని, దీన్ని పెంచుతూ లక్ష మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని వెలికితీసేందుకు అనుమతులు కోరుతూ 2010లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. పర్యావరణానికి హాని లేకుండా మైనింగ్ కాార్యకలాపాల విస్తరణకు సంస్థ రూపొందించిన సమగ్ర ప్రణాళికను ఆయన వివరించారు.
ఉపాధి, గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి.. గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు, ప్రత్యేక అవసరాల్లో కంపెనీ యాజమాన్యం ఆర్థిక సాయం అందించాలన్నారు. కంపెనీలో పనిచేసే కార్మికులకు రక్షణ సదుపాయాలతోపాటు కొత్తగా వచ్చే ఉద్యోగాలను కల్పించాలన్నారు. పర్యావరణానికి ముప్పు రాకుండా గ్రీన్ బెల్టును ఏర్పాటు చేయాలని వాయు, నీటి కాలుష్యం తలెత్తకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. దేవాడ గ్రామం ఈ గని ద్వారా ఎక్కువ కాలుష్యానికి లోనయ్యే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఈగ్రామాన్ని కంపెనీ దత్తత తీసుకోవాలని ప్రతిపాదించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులో గుర్ల మండలం సదానందపురం, నాగళ్లవలసతో పాటు గరివిడి మండలం దేవాడ, దుమ్మేద, తోండ్రంగి, దువ్వాం, శేరీపేట తదితర గ్రామాల పెద్దలు, యువకులు, పర్యావరణ హితవు కోరే సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, దంఢ ఖండన చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు వై. చెన్నకేశవ రెడ్డి, ప్రకృతి డెవలప్ మెంట్ ట్రస్టు అధ్యక్షుడు ఎన్. రమేష్ నాయుడు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. మాంగనీసు గని విస్తరణకు అంతా ఆమోదం తెలిపారు. మాంగనీసు ఖనిజాల తవ్వకాలలో ప్రభావిత గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, పర్యావరణానికి హాని లేకుండా పచ్చదనం పెంచాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని, కాలుష్య నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ సదస్సులో 27 మంది వరకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా, మరో 25 మంది లిఖిత పూర్వకంగ అందజేశారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, దశలవారీగా అమలు చేస్తామని మైనింగు సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ప్రజాభిప్రాయ సదస్సులో వెల్లడించిన అభిప్రాయాలన్నీ నమోదు చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదికను పంపుతామన జేసీ-2 కూర్మనాధ్ తెలిపారు.