ఈ నెల 15లోగా ఓటరుగా చేరితే.. సర్పంచి ఎన్నికల్లో ఓటు హక్కు

ఈ నెల 15వ తేదీలోగా ఓటరుగా పేరు నమోదు చేసుకున్న అందరికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కల్పిస్తోంది. అదే రోజు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ రోజు అర్ధరాత్రిలోగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పేర్లు నమోదైన వారందరికీ సర్పంచి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ అధికారులు తెలిపారు. అయితే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 7నే వెలువడిన దృష్ట్యా.. ఆ ఎన్నికలకు మాత్రం 7వ తేదీ అర్ధరాత్రి వరకు ఓటర్లుగా నమోదైన వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుందన్నారు. అలాగే, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ 9వ తేదీ వరకు ఓటరుగా నమోదైన వారికి ఓటు హక్కు అవకాశం ఉంటుంది.