
తమ పరిశ్రమ అనుములకు రూ.5 లక్షలు తీసుకుని పంచాయతీ కార్యదర్శి రూ.2 లక్షలకే రషీదు ఇచ్చారని సదరు పరిశ్రమ ప్రతినిధి కార్యదర్శి, కారోబార్ లపై చిట్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ విషయంలో పరిశ్రమలోని పలు నిర్మాణ పనులకు ఎన్ఓసీ ఇచ్చేందుకు డబ్బులు కాజేసిన పంచాయతీ కార్యదర్శిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్యాల మండలం ఏపూరు మిల్లు, జ్యూస్ పరిశ్రమ, గోదాముల నిర్మాణ పనుల అనుమతులకు ఆ గ్రామ పంచాయతీలో ఎన్ఓసీ పత్రాలను తీసుకోవాల్సి ఉంది. కాగా ఆ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర రావు అనారోగ్యం కారణంగా గత నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సెలవు పెట్టి వెళ్లారు. దీంతో మండలంలోని గుండ్రాంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బ్రహ్మచారిని ఇన్ చార్జ్ కార్యదర్శిగా పై అధికారులు నియమించారు.
అందివచ్చిన అవకాశంతో బ్రహ్మచారి డీఈసీ పరిశ్రమ నిర్మాణ పనుల అనుమతులకు ఎన్ఓసీ పత్రాలను పొందేందుకు చేస్తున్న ప్రయత్నాల విషయం తెలుసుకున్నారు. దీంతో పరిశ్రమ ప్రతినిధులతో పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజేప్పేలా మాట్లాడుకుని ఎన్ఓసీ పత్రం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం ఆ పరిశ్రమ ప్రతినిధి ఇచ్చిన మొత్తంలో రూ.2.2 లక్షలు పంచాయతీ రుసుముగా నిర్ణయించాడు. ఇన్ చార్జ్ కార్యదర్శిగా పదవీకాలం ముగిసినా గత నెల 22వ తేదీన కంపెనీ ప్రతినిధులకు రసీదు ఇచ్చాడు. కానీ ఎన్ఓసీ పత్రాలు ఇవ్వలేదు. సరికదా డబ్బులను కూడా ట్రెజరీలో జమ చేయలేదు. అనంతరం రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు 22వ తేదీన విధుల్లో చేరిన అనంతరం ఎన్ఓసీ పత్రం కోసం ఆ డీఈసీ పరిశ్రమ ప్రతినిధులు పంచాయతీకి వచ్చి వెళుతున్నారు. కాగా ఇన్ ఛార్జ్ పంచాయతీకి కార్యదర్శిగా పనిచేసిన బ్రహ్మచారి ఎన్ఓసీ పత్రానికి అనుమతులిచ్చినట్లు తెలుసుకున్న రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు పంచాయతీ పాలకవర్గం సభ్యులకు తెలియజేశారు. అనంతరం డీఈసీ పరిశ్రమ ప్రతినిధులు సైతం ఎన్ఓసీ పత్రాల అనుమతులకు పంచాయతీ ఫీజు చెల్లించినా ఎన్ఓసీ పత్రాలు ఇవ్వడం లేదని చిట్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్ ఛార్జ్ కార్యదర్శిగా పనిచేసిన బ్రహ్మచారి ఆయనకు సహకరించిన రాములును పోలీసులు మంగళవారం చౌటుప్పల్ లోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకుని చిట్యాల పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. డీఈసీ పరిశ్రమ ప్రతినిధి ఫిర్యాదు చేసిన విషయమై ఏపూరు పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, మండల పంచాయతీ అధికారి పద్మను పోలీసులు విచారించి బ్రహ్మచారి అతడికి సహకరించిన వారిపై కేసు నమోదు చేశారు.
ఎంపీఓ పద్మ వివరణ..
ఇన్ చార్జ్ కార్యదర్శిగా ఉన్న అధికారి తాత్కాలిక పనులను మాత్రమే నిర్వహించాల్సి ఉంటుందని మండల పంచాయతీ అధికారి పదమ్మ వివరణ ఇచ్చారు. పంచాయతీ ఇన్ చార్జ్ గా విధులు ముగిసినప్పటికీ ఆ సమయంలో పరిశ్రమకు ఎన్ఓసీ పత్రాలు మరో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బ్రహ్మచారి అనుమతులిచ్చాడని ఆమో వివరణ ఇచ్చారు. నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఎన్ఓసీని రద్దు చేస్తూ గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం
గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం లేకుండా ఇన్ చార్జ్ పంచాయతీ కార్యదర్శి ఎన్ఓసీ అనుమతులివ్వటంపై ఏపూరు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు మంగళవారం ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలెం మాధవి మల్లేష్ గౌడ్ అధ్యక్షతన సమావేశమయ్యారు. ఇన్ చార్జ్ కార్యదర్శి బ్రహ్మచారి ఇచ్చిన ఎన్ఓసీ రసీదును రద్దు చేస్తూ తీర్మానం చేశారు. కాగా, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మచారి వ్యవహారం ఆదినుంచి వివాదాస్పదమే అని తెలిసింది.