
కాలుష్య పరిశ్రమలపై చర్యలేవి ?
కోర్టులు చెబితే కానీ కదలరా ? 
కాలుష్య పరిశ్రమలపై హైకోర్టు ఆగ్రహం
8 ఏళ్ల మీ  (పీసీబీ)  నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీరు కూడా 2020లోనే మేల్కొన్నారు. కొన్ని పరిశ్రమలకు మీ సమ్మతి ఉంది. మరికొన్ని పరిశ్రమలకు మీ సమ్మతి లేదు. సమ్మతి ఉండీ పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘించిన వాటిపై ఏం చర్యలు తీసుకున్నారు ? మీ విధులు నిర్వహించడంలో విఫలమయ్యారు. అందుకే ఇక్కడ వేలకొద్దీ పిటిషన్లు దాఖలవుతున్నాయి. 2020 నుంచి మీరు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి. – పీసీబీకి హైకోర్టు ఆదేశం
కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ ఎంసీ, విద్యుత్తు శాఖలు కాలుష్య కారక పరిశ్రమల గురించి ఏవీ పట్టించుకోవు, పని చేయవు. ఇదేనా మీరందించే సుపరిపాలన ? ప్రజలు రోగాలతో చనిపోతున్నారు. పిల్లల ఊపిరితిత్తులు ఇప్పటికే పాడయి ఉంటాయి. వారి  గురించి ఆలోచించే పరిస్థితిలో అధికారులు లేరు. భావితరాలకు మంచి నగరాన్ని ఇవ్వలేమా ? ప్రజల ఆరోగ్యానికి భద్రత ఇవ్వగలిగినవారే మౌనంగా ఉన్నారు. నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాల్సిందే. అది కాలుష్య కారకులు చెల్లిస్తారో, ప్రభుత్వం చెల్లిస్తుందో లేక అదికారుల నుంచి వసూలు చేస్తారో మాకు అనవసరం. ఎవరినీ వదిలి పెట్టం… – హైకోర్టు వ్యాఖ్యలు 
కాలుష్యం కోరలు చాచింది. అయిన సరే పీసీబీ నిద్రపోతుంది.  జీహెచ్ఎంసీ కూడా నిద్రపోతోంది. నిద్ర కూడా కాదు. కోమాలో ఉంది. అందుకే 8 ఏండ్ల నాటి కేసులో ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేపోయింది. కేసులు పడ్డప్పుడు మూడు ఇండ్రస్టీస్ నుంచే పొల్యూషన్ వెలువడుతోందని జీహెచ్ఎంసీ చెప్పింది. అనుమానం వచ్చి హైకోర్టు కమిటీ వేసి రిపోర్టు తెప్పించుకుంటే 345 ఇండస్ట్రీస్ నుంచి కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని తేలింది. దీంతో జీహెచ్ఎంసీ కళ్లు తెరిచి 3 కాదు 198 ఇండస్ట్రీస్ నుంచి కాలుష్య సమస్య ఉందని మరో అఫిడవిట్ వేసింది. 2012 నాటి పిల్స్‌పై అప్పుడే జీహెచ్ఎంసీ, విద్యుత్, కాలుష్య నియంత్రణ మండలి కలిసికట్టుగా పనిచేసుంటే 198 నుంచి 345కు పెరిగేవికాదు. కాలుష్యం వల్ల జనం అల్లాడిపోతున్నారు. అయినా అధికారులకు పట్టడం లేదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా ఉంటే అధికారులను కూడా వదిలిపెట్టేది లేదు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు.. అని హైకోర్టు నిప్పులు చెరిగింది.
ఇలాగే వదిలేస్తే కాలుష్యంలో డిల్లీ, ముంబైల కంటే ముందుకు మన హైదరాబాద్ ఉంటుంది. 2016లో పొల్యూషన్ వల్ల సమస్యలున్న పరిశ్రమలపై చర్యలకు వీలుగా రాష్ట్ర సర్కార్ జీవో ఇస్తే దానిని అమలు చేయలేదని జీహెచ్ఎంసీ చెప్పడాన్ని ఎలా తీసుకోవాలి? నిజాయితీగా ఒప్పుకున్నందుకు అభినందించాలా లేక 2016 నాటి జీవో అమలు చేయలేదని నిందించాలా.. అని ప్రశ్నించింది. 2012 నాటి పిల్స్‌పై తగిన చర్యలు తీసుకోలేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ చెప్పడంపై హైకోర్టు సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇకమీదటైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్థానిక శాస్త్రిపురంలో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై సమగ్ర నివేదికను అందజేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిల డివిజన్ బెంచ్ బుధవారం ఉత్తర్వులిచ్చింది.
పొంతనలేని వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయడంపై వివరణ ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూ టీ కమిషనర్లు బుధవారం జరిగిన విచారణకు హాజరయ్యారు. 98 ఇండస్ట్రీస్‌ను మూసేశామ ని, 198 పరిశ్రమలకు నోటీసులుఇచ్చామని, అవిఇచ్చే రిప్లయ్స్ను బట్టి మూసివేత చర్యలు తీసుకుంటామని, వాటన్నింటికీ ఈ నెల 2నే నోటీసులు ఇచ్చామని కమిషనర్ హైకోర్టుకు వివరించారు. ఆలస్యం చేసినందుకు క్షమాపణలు చెప్పారు.
2012 నుంచి పీసీబీ ఏం చేస్తుందని, 8 ఏళ్లుగా నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించిందని ధర్మాసనం ప్రశ్నించగా పీసీబీ తరపు న్యాయవాది 2017లో నోటీసులిచ్చామన్నారు. 2012 నుంచి అడుగుతుంటే అయిదేళ్లు వదిలేసి 2017 నుంచి ఎందుకు చెబుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. భద్రత కల్సించాల్సిన అధికారులు మౌనంగా ఎందుకు ఉన్నారని, అలా తప్పు చేసిన అధికారులను శిక్షించాలని పేర్కొంది. పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.