కరోనాపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ పట్ల తెలంగాణ సర్కార్ అప్రమత్తమైనట్లు ముఖ్యమంత్రి కెసిఆర్‌ పేర్కొన్నారు. అసెంబ్లీలో కరోనా వైరస్‌పై సిఎం ప్రకటన చేశారు. ఆ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… ”కరోనా వైరస్ కట్టడికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నమన్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తున్నం. ఇప్పటికే దేశంలో 10 మందికి కరోనా నయమైంది. రాష్ట్రంలో 65మందికి చికిత్స కొనసాగుతోంది. దేశంలో ఇద్దరు మృతి చెందారు. చరిత్రలో కరోనా లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. బయటి దేశాల నుంచి వస్తున్న వారితోనే కరోనా వైరస్ గుర్తించాం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్రం, రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి.
పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, మాల్స్ బంద్ చేశారు. ఉన్నతాధికారులతో హైలెవల్ కమిటీ మీటింగ్ జరుగతోంది. కరోనా పాజిటివ్ వ్యక్తికి విజయవంతంగా నయం చేయగలిగాం. దేశంలోని ఆరు ప్రధాన మెట్రో సిటిల్లో హైదరాబాద్ ఒకటి. శంషాబాద్ ఎయిర్ పోర్టులో రద్దీ బాగా పెరిగింది. మెట్రోలో రోజుకు నాలుగు లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. 2013-14లో 200కుపైగా విమానాలు వస్తే, ఇప్పుడు 500పైగా వస్తున్నయి. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని పరిశీలనలో ఉంచిన తర్వాతే బయటకు పంపిస్తాం. ఎయిర్ పోర్టులో 200 మంది ఆరోగ్యశాఖ సిబ్బంది సిద్దంగా ఉన్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహిస్తాం. దాని నుంచి తగిన చర్యలు తీసుకునే అవకాశముంటుంది. కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తం. ముందుగా జాగ్రత్త చర్యగా మాస్క్ లు , మెడికల్ సూట్లు సిద్దం చేస్తున్నం. అవసరమైతే రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తాం”అని సిఎం కెసిఆర్ చెప్పారు.