ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ, సీనియర్ అసిస్టెంట్

నాగర్ కర్నూల్ జిల్ల అచ్చంపేట ఎక్సైజ్ సీఐ శ్రావణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్ లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మహబూబ్ నగర్ ఏసీబీ అధికారి కృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పదర మండలం మారడుగు గ్రామానికి చెందిన దేశవంత్ వెంకటరమణ్ నాయక్ 2018లో తన కారులో బెల్లాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేశారు. అప్పట్లో రూ.లక్ష డిపాజిట్ కూడా చేశాడు. తన కారును విడిపించుకునేందుకు ఎక్సైజ్ ట్రిబ్యునట్ డైరెక్టరేట్ కు అప్పిల్ చేసుకోగా కారును రిలీజ్ చేయాలంటూ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఉత్వర్వులను అచ్చంపేట సీఐ శ్రావణ్ కుమార్ కు అందించగా కంప్యూటర్ ప్రింటర్ ను ఇప్పించాలని డిమాండ్ చేశారు. తాను అంత డబ్బులు చెల్లించలేనని, రూ. 9 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో సీఐ శ్రవణ్ కుమార్ పై వెంకట్ రమణ్ ఈ నెల 9న మహాబూబ్ నగర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రూ.9వేల నగదును సోమవారం రాత్రి సీఐ శ్రవణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్ లకు అందించిన వెంటనే ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. వీరిని మంగళవారం హైదరాబాద్ లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ, అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, నల్లగొండ, మెదక్ జిల్లా ఇన్ స్పెక్టర్ లు రఘుబాబు, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు లంచం కోసం వేధిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని సూచించారు.