సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువులోని మై హోమ్స్ సంస్థ మహా సిమెంట్స్ ఆవరణలోని శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అతిథులు, అనేక మంది ఆహ్వానితులు, భక్తుల మధ్య చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సతీమణి ఉషా దయాకర్ రావులు హాజరయ్యారు. మై హోమ్స్ జూపల్లి రామేశ్వరరావు-సుకుమార్ దంపతులు స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి కళ్యాణం జరిగింది. కళ్యాణం అనంతరం చిన్న జీయర్ స్వామి మంత్రి ఎర్రబెల్లి దంపతులు, రామేశ్వరరావు దంపతులు సహా, భక్తులందరికీ ఆశీర్వచనాలు అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, మై హోం ఇండస్ట్రీస్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, చుట్టు ప్రాంతాల ప్రజలు అనేక మంది పాల్గొన్నారు.