
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎమ్మెల్సీ స్థానానికి కవిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 19న నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ కాగా, బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో కలిసి కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక లాంఛనమేనని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ.. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కవిత సునాయాసంగా గెలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్ 7న పోలింగ్ నిర్వహించి 9న ఓట్ల లెక్కింపు చేపడతారు. 2015లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరిన భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం 2022, జనవరి 4 వరకు ఉండటంతో ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రక్రియ చేపట్టింది.