
మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఇవాళ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చైర్ వద్దకు గొగోయ్ చేరుకోగానే విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు.గొగోయ్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో కొందరు ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. గొగోయ్‌ను ఎంపీగా ప్రమాణం చేయనీయవద్దు అంటూ కొందరు చైర్మన్ వెంకయ్యను వేడుకున్నారు. అయితే ఆ సమయంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు.
ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారమే గొగోయ్‌ను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు రాజ్యసభకు వచ్చే సాంప్రదాయం ఉన్నదని, మాజీ సీజే గొగోయ్ కూడా దేశ సేవకు తన వంతు సాయం అందిస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గొగోయ్ ప్రమాణ స్వీకార సమయంలో విపక్షాలు వాకౌట్ చేయడం సరైందికాదన్నారు.