
నిర్భయ దోషులకు శుక్రవారం ఉరి అమలు కానుంది. ముందు ప్రకటించిన సమయం ప్రకారం నలుగురు దోషులకు 27న ఉదయం 5:30 గంటలకు తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ పటియాలా కోర్టు కొట్టివేసింది. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అక్షయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరణ శిక్షను జీవిత ఖైదుగా కుదించాలని పవన్ గుప్తా పెట్టుకున్న క్యురేటివ్ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. ఈ నలుగురు దోషులు ఇప్పటికే న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు.
నిర్భయ కేసు దోషులన్ని శుక్రవారం ఉరి తీయనున్న నేపథ్యంలో ఉరితీతకు సంబంధించిన ముందస్తు డమ్మీ రిహార్సల్ ను తీహార్ జైల్లో తలారి పవన్ జల్లాద్ బుధవారం నిర్వహించిన సంగతి తెలిసిందే. దోషుల్ని ఉరి తీసేందుకు వాడే మనీలా తాళ్లను రిహార్సల్ లో భాగంగా జల్లాద్ పరీక్షినట్టు జైలు అధికారులు పేర్కొన్నారు. ఒకే కేసులో నలుగురు దోషుల్ని ఒకేసారి ఉరి తీయడం తీహార్ జైలు చరిత్రలోనే తొలిసారని అధికారులు తెలిపారు. కాగా తన తాతయ్య కూడా ఇది వరకు పలువురు దోషుల్ని ఉరి తీసినట్టు జల్లాద్ గతంలో పేర్కొన్నాడు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య కేసు దోషులు సత్వంత్ సింగ్, కెహార్ సింగ్ తో పాటు పేరు మోసిన నేరస్థులు బిల్లా, రంగాను తన తాతయ్యను ఉరి తీసినట్టు వెల్లడించాడు.