ఉదయం 5:30 గంటలకు నిర్భయ దోషులు పవన్ కుమార్, అక్షయ్ కుమార్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలకు ఉరిశిక్ష అమలు అయింది. . ఈ నేపథ్యంలో అంతకు ముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితి బాగుందని తీహార్ జైలు వైద్యాధికారులు ప్రకటించారు. ఉరిశిక్ష అమలు నేపథ్యంలో తీహార్ జైలు లాక్‌డౌన్ చేశారు. తిహార్ జైలు బయట జనం గుమికూడారు. తిహార్ జైలు బయట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్భయ ఘటన ఢిల్లీలో 2012 డిసెంబర్ 16వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. బాధితురాలు 13 రోజులు మృత్యువుతో పోరాడి డిసెంబర్ 29వ తేది ఉదయం 4:30 గంటలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం జైలు సూపరింటెండెంట్, వైద్యాధికారి, జిల్లా కలెక్టర్ దోషులు ఉన్న సెల్‌లోకి వెళ్లి దోషిని కలిశారు. చివరి కోరిక, ఇతర విషయాలన్ని పత్రాల్లో రాయించుకుని దోషుల సంతకాలు తీసుకున్నారు. జైలు నెంబర్ మూడులో ఉన్న ఉరికంబం వద్దకు దోషులను తరలించారు.
ఉరికంబం ఎక్కే ముందు దోషి ముఖాన్ని కాటన్ వస్త్రంతో కప్పారు. ఉరి నిబంధన ప్రకారం దోషి ఉరికంబాన్ని చూడకూడదని ఈ విధంగా చేస్తారు. వార్డెన్లు దోషులను పట్టుకున్నారు. సూపరింటెండెంట్ సంజ్ఞా చేయగానే వార్డెన్లు దోషులను విడిచిపెట్టారు. ఆ తరువాత తలారి బోల్టును లాగాడు. దీంతో ఉరిశిక్ష అమలు పూర్తయింది. దోషుల మృతదేహాలను కిందకు దించారు. దోషులు మృతి చెందినట్లు డాక్టర్లు దృవీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం డీడీయూ ఆస్పత్రికి తరలించారు. శవాలకు ఉదయం 8 గంటలకు పోస్టుమార్టం పూర్తి చేస్తారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తారు. ఖననం చేయడానికి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేసులో మరో దోషి రాంసింగ్ 2013 మార్చి 11వ తేదీన తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో మైనర్ నిందితుడికి 2013 ఆగస్టు 31న మైనర్ దోషికి మూడేళ్ల రిఫార్మ్ హోం శిక్ష విధించారు. 2015 డిసెంబర్ 20వ తేదీన రిఫార్మ్ హోం నుంచి మైనర్ విడుదలయ్యాడు.