
 దేశవ్యాప్తంగా  విజృంభిస్తున్న కరోనా వైరస్ను  అరికట్టడంలో ముందంజలో ఉన్న రాష్ర్ట ప్రభుత్వం, ఇప్పటికే అప్రమత్తమై కరోనాను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల్లో మరింత భరోసాను నింపేందుకు స్వయంగా ముఖ్యమంత్రి  కేసీఆర్  కరీంనగర్ పర్యటనకు పూనుకున్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో  సీఎం పర్యటన వల్ల అక్కడ భారీ స్థాయిలో జరుగుతున్న స్క్రీనింగు, వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలగకుండా ఉండాలని,  కరీంనగర్ జిల్లా యంత్రాంగం, వైద్యశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి తదితరుల సూచనల మేరకు.. శనివారం సీఎం కేసీఆర్ తలపెట్టిన కరీంనగర్ పర్యటన వాయిదా పడింది.
ఇప్పటికే  ముఖ్యమంత్రి రాష్ట్రంలో కరోనా పరిస్థితి సహా కరీంనగర్ లో జరుగుతున్న వైద్య ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు పలు మార్లు ముఖ్యమంత్రి ఆరాతీశారు.  వారు కూడా కరీంనగర్ లో జరుగుతున్న ఏర్పాట్ల విషయంలో సీఎంకు  భరోసానివ్వడమే కాకుండా పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరడంతో ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడింది.