
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ మహమ్మారికి దారులు తెరుస్తున్నారు. చేతిపై హోమ్ క్వారంటైన్ స్టాంపులు వేసినా కొందరు జనం మధ్య తిరుగుతూ వైరస్ విస్తరణకు కారణమవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే నాంపల్లి రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. చేతిపై హోమ్ క్వారంటైన్ స్టాంపుతో ఉన్న ఓ కరోనా అనుమానితుడిని నాంపల్లి స్టేషన్లో రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అనంతరం గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌కు చెందిన మోసిన్ అలీ.. నైజీరియా, లాగోస్ నుంచి అబుదాబీ మీదుగా విమానంలో ముంబైకి వచ్చాడు. ముంబై నుంచి ఓ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ ఉదయం నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. అయితే సాయిరాం అనే మరో ప్రయాణికుడు మోసిన్ చేతిపై హోమ్ క్వారంటైన్ స్టాంపును చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రైల్వే పోలీసులు మోసిన్ అలీని అదుపులోకి తీసుకుని 108 అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.