
రేపు ఉదయం 6 గంటల నుంచి 31 మార్చి, రాత్రి 12 గంటల వరకు రాష్ట్రం లాక్డౌన్లో ఉంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో రాజధాని రాష్ట్రంలో ఈ నిబంధన అమలులో ఉంటుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు నిత్యం విదేశాలు నుంచి వందలాది విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయనీ.. కరోనా బాధితులు కూడా విదేశాల నుంచే వస్తుండడంతో విమానాలను కూడా మార్చి 31 వరకు రద్దు చేస్తున్నామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
లాక్డౌన్ సమయంలో ప్రజారవాణా వ్యవస్థలన్ని కూడా రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రైవేట్ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు పూర్తిగా నిషేధిస్తున్నామన్నారు. 25 శాతం డీటీసీ బస్సులు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
అన్ని ప్రైవేట్ ఆఫీసులు కూడా బంద్ చేస్తున్నట్లు సీఎం అన్నారు. ఉద్యోగులు డ్యూటీలో ఉన్నట్లుగానే పరిగణలోకి తీసుకొని, వారికి సంస్థలు జీతాలు ఇవ్వాలని సీఎం విన్నవించారు. కిరాణా స్టోర్స్, బేకరీలు, ఆస్పత్రులు, మెడికల్ స్టోర్స్, పెట్రోల్ పంపులు మొదలగు అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని సీఎం కేజ్రీవాల్ మీడియాకు వెల్లడించారు.
ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలనీ.. స్వీయ నిర్భదంలో ఉండాలని తెలిపారు. ప్రజలు తమకు తామే సామాజిక దూరం పాటించాలనీ.. సమూహాలుగా ఏర్పడకూడదని ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ తెలిపారు.