
కరోనా వైరస్‌పై ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. కరోనా కట్టడి కోసం చేపట్టిన జనతా కర్ఫ్యూ ను పరిశీలించిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌పై ట్విట్టర్, వాట్సఫ్ తదితర సోషల్ మీడియాలో రూమర్లు సృష్టించే వారిపై ఒక సంవత్సరం జైలు శిక్ష విధింపజేస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేసిన నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. జనతా కర్ఫ్యూకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించి విజయవంతం చేశారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22 చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారి వివరాలను డయల్ 100 లేదా రాచకొండ కమిషనరేట్ వాట్సాప్ నంబర్ 94906 17111కు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు. అంతేకాకుండా డూప్లికేట్ శానిటైజర్లు తయారు చేసిన కేసులో చర్లపల్లిలో కొందరిని అరెస్టు చేసి రూ. 40 లక్షల శానిటైజర్లు.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆరుగురిని అరెస్టు చేసి రూ. కోటి విలువైన డుప్లికేట్ శానీటైజర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కరోనా కట్టడి కోసం అందరూ కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.