
కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ నెలాఖరు వరకు ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోనున్నది. దక్షిణ మధ్య రైల్వే అన్ని రైళ్ళను రద్దు చేయగా, మెట్రోరైలు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లను 31వ తేదీ వరకు రోడ్డెక్కించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రజా రవాణాలో భాగమైన ఏ ఒక్క వాహనం కదలదు. దక్షిణమధ్య రైల్వేలో భాగంగా నగర రవాణాలో కీలక భూమిక పోషిస్తున్న 121 ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు 30 సబర్బన్ రైళ్లను నిలిపివేయనున్నారు. ఇక ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 2850 బస్సుల్లో ఎమర్జెన్సీ సర్వీసుల కోసం 145 బస్సులను మినహాయించి మిగతా వాటిని నిలిపివేయనుంది. డిపోకు 5 బస్సులను ఎమర్జెన్సీ అవసరాల కోసం సిద్ధంగా ఉంచనున్నారు.
అదే విధంగా ఎమర్జెన్సీ అవసరాల కోసం 5 మెట్రోరైళ్లు, 12 ఎంఎంటీఎస్‌లను ట్రాక్‌లపై సిద్ధంగా ఉంచనున్నారు. కరోనా వైరస్ విజృంభించకుండా ఉండాలంటే ఈ నిర్ణయం తప్పదని ప్రభుత్వం ప్రకటించింది.