
తెలంగాణ రాష్ట్ర సీఎం రీలిఫ్ ఫండ్‌కు మేఘా ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ రూ. 5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి.కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. ఊహించని పరిణామంతో కోవిడ్-19 రూపంలో రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 195 దేశాల్లో విస్తరించిందని.. ఐదు లక్షల మంది కరోనా భారిన పడినట్లు తెలిపారు. ఈ ఆపత్కాలంలో ప్రజలు మీపై, మీ పాలనాదక్షతపై నమ్మకం పెట్టుకున్నారన్నారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి, రాష్ర్టాన్ని , రాష్ట్ర ప్రజలను రక్షించుకునేందుకు మీరు ఎన్నో సహసోపేతమైన చర్యలకు పూనుకున్నారు.
కేంద్రంకంటే ముందుగానే చర్యలు చేపడుతూ రాష్ట్ర సరిహద్దులను బంద్ చేశారన్నారు. ప్రభుత్వ చర్యలను తాము ప్రశంసిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి తమ మద్దతును తెలియజేస్తున్నట్లు తెలిపారు. మొదటి చర్యగా రూ. 5 కోట్లను సీఎం రీలిఫ్ ఫండ్‌కు అందజేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా పోలీస్ విభాగంతో, ఆస్పత్రులతో టచ్‌లో ఉంటున్నామన్నారు. సామన్య ప్రజలకు ఆహారం, నీళ్లు సరఫరా చేసేందుకు తమ వంతు చేయూతనందిస్తున్నట్లు వెల్లడించారు. మా ఈ సహాయాన్ని స్వీకరించాల్సిందిగా కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు.