
జలమండలి ఎండీ దానకిశోర్ అధ్యక్షతన నేడు (శనివారం) ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో డయల్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు డివిజన్, సర్కిల్ కార్యాలయాల్లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపనున్నారని చెప్పారు. వినియోగదారుడు వారి ఫిర్యాదులను బోర్డుకు దృష్టికి తీసుకురావడానికి వినియోగదారుల కాన్ (కస్టమర్ అకౌంట్ నంబరు), ఫోన్ నంబరును అందుబాటులో ఉంచుకుని 23442881/23442882/23442883 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా వినియోగదారులు తమ సమస్యల పరిష్కారం కోసం జలమండలి కార్యాలయాలు సందర్శించాల్సి అవసరం లేకుండా ఒక్క ఫోన్‌కాల్‌తో పరిష్కారం చేసుకోవచ్చని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.