
ఎంతో సామాజిక స్పృహ ఉన్న టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. రీల్ లైఫ్‌లో కాకుండా రియల్ లైఫ్‌లోను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇటీవల కరోనా నిర్మూలనలో భాగంగా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల సహాయనిధికి మహేష్ రూ. కోటి సాయం అందించారు. ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షల చొప్పున ఆయన విరాళం ప్రకటించారు. ఇక తాజాగా లాక్‌డౌన్ నేపథ్యంలో తిండి దొరకక ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకి తన వంతుసాయంగా రూ.25 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
లాక్ డౌన్ ప్రభావం రోజువారి ఆదాయం సంపాదించే సినీ కార్మికులపై ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో వారి కోసం రూ.25లక్షలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు మహేష్ బాబు. ప్రస్తుతమున్న పరిస్థితులుల్లో సినీ ఇండస్ట్రీకి చెందినవారంతా సీనీ పరిశ్రమలోని కార్మికుల్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. సినీ కార్మికులకి అండగా నిలిచేందుకు ఇప్పటికే చిరంజీవి కోటి రూపాయలు, నాగార్జున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక చిత్ర పరిశ్రమలోని పేద కార్మికులకు సహాయం చేస్తూనే ప్రభుత్వానికి కూడా తమ వంతు ఆర్థిక సహాయాన్ని టాలీవుడ్ ప్రముఖులు అందించారు. ప్రభాస్ రూ.4 కోట్లు,అల్లు అర్జున్ రూ.1.25 కోట్లు, నితిన్ రూ. 20 లక్షలు, దగ్గుబాటి ఫ్యామిలీ రూ. కోటి, రామ్ చరణ్,ఎన్టీఆర్ రూ.75 లక్షలు, పవన్ కళ్యాణ్ రెండు కోట్లు విరాళంగా ప్రకటించారు . ఇందులో కొంత మంది ప్రధాన మంత్రి సహాయక నిధికి కూడా విరాళాలు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీ నుంచి కరోనా వైరస్ కోసం పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తుండడం గమనర్హం.