
ఏపీలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ఈ నెల 17న బర్మింగ్‌హోమ్ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా ఇద్దరికి కరోనా వ్యాప్తి చెందింది. ఇప్పటికే బాధితులు స్వీయనిర్బంధంలో ఉన్నారు. అటు నెల్లూరు, విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక గుంటూరు జిల్లాలో ఓ ప్రజాప్రతినిధికి చెందిన కుటుంబం, సిబ్బందికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఇవాళ 102 నమూనాలు పరీక్షించగా 100 నెగిటివ్ వచ్చాయి. మొత్తం కేసుల్లో విశాఖ జిల్లా 6, కృష్ణా 4, గుంటూరు 4, ప్రకాశం 3, కర్నూలు, తూ.గో, నెల్లూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.