వదంతుల వ్యాప్తికి కఠిన శిక్ష – డిజిటల్‌ మీడియా విభాగం డైరెక్టర్‌ దిలీప్‌

కరోనా వైరస్‌కు సంబంధించి డిజిటల్‌ మీడియాలో వదంతులను ప్రచారం, ప్రసారం చేస్తే కఠిన శిక్షలు తప్పవని తెలంగాణ డిజిటల్‌ మీడియా విభాగం డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. సోషల్‌మీడియా విభాగాలైన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, టిక్‌టాక్‌ తదితర యాప్స్‌లో జరిగే ప్రచారాన్ని యథాతథంగా వ్యాపింపజేయవద్దని పేర్కొన్నారు. అవాస్తవాలు, అనైతికంగా రూపొందించే సమాచారాన్ని, వ్యాఖ్యలను ప్రచారంచేసి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించవద్దని.. సమాచారాన్ని వ్యాప్తిచేసే ముందు ప్రామాణికతను రూఢీ చేసుకోవాలని కోరారు. తప్పుడు సమాచారం, వదంతులు మరో మహమ్మారిగా మారి ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్‌గా పరిణమిస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై గెలువాల్సిన యుద్ధంలో భాగస్వాములమవుదామని, క్లిష్ట సమయంలో ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికేలా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మరింత సమాచారం, సందేహాల నివృత్తికి dir dm@ telangana.gov.in మెయిల్‌లో సంప్రదించాలని సూచించారు.
పౌరులకు సూచనలు
డిజిటల్‌ మాధ్యమాల్లో వచ్చిన సమాచార ప్రామాణికతను రూఢీ చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చేరవేయొద్దు.వాట్సాప్‌ వంటి వేదికల్లో బృంద సభ్యులు తప్పుడు సమాచారం వ్యాపింపజేస్తే, అడ్మిన్స్‌ బాధ్యులవుతారు. విచారణ ఎదుర్కోవాలి. కరోనా సోకినవారి వ్యక్తిగత వివరాల గోప్యత ముఖ్యమైన అంశం. వారి వివరాలను వ్యాపింపజేయడం అనైతికం. ఇది శిక్షార్హమైన నేరం. విపత్తుల సమయంలో వదంతులను, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసేవారికి విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని 54 సెక్షన్‌ ప్రకారం ఏడాది జైలుతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. ఐపీసీ సెక్షన్‌ 505 ప్రకారం కూడా శిక్షార్హులవుతారు.కరోనావైరస్‌ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అంటువ్యాధుల చట్టం-1897 నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబంధనల్లోని 10వ సెక్షన్‌ ప్రకారం కరోనా వైరస్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారాన్నయినా అధికారులతో ధ్రువీకరించుకోకుండా వార్తా పత్రికలు, టీవీ చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేయకూడదు. దీనికి విరుద్ధంగా వ్యాప్తిచేస్తే ఆ చట్టాల కింద శిక్షార్హులవుతారు. సమాచార మాధ్యమాలకు సూచనలు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తిలో ఉన్న సంచలనాత్మక, భయాందోళనలకు గురిచేసే, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని కొన్ని ప్రధాన స్రవంతి వార్తాపత్రికల ఆన్‌లైన్‌ ఎడిషన్లు, న్యూస్‌సైట్లు యథాతథంగా ప్రచురించడం శిక్షార్హం. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. కొన్ని యూట్యూబ్‌ చానళ్లు చాలా వార్తలను తప్పుడు థంబ్‌నెయిల్స్‌తో పోస్టుచేస్తున్నాయి. సంబంధిత వార్తకు, సమాచారానికి సంబంధం లేని ఈ థంబ్‌నెయిల్స్‌ వీక్షకుడిని తప్పుదోవ పట్టించడమే. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని అవహేళనచేసేలా, వారిపై చులకన భావం కలిగించేలా, మనోైస్థెర్యాన్ని దెబ్బతీసేలా వీడియోలు ఉండటం డిజిటల్‌ మాధ్యమాల నిబంధనలకు విరుద్ధం. తప్పుదోవ పట్టించే వార్తలు, వీడియోలను ప్రచురించే, ప్రసారంచేసే వేదికలపై డిజిటల్‌ మీడియా విభాగం సంబంధిత సామాజిక మాధ్యమ సంస్థల దృష్టికి తీసుకెళ్లి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి వార్తలు, వీడియోలను పోస్టుచేస్తున్న ఆన్‌లైన్‌ న్యూస్‌ వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ చానళ్లకు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం నిలిపివేసే అవకాశం ఉంటుంది. తరచుగా తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే చానళ్లను ఆయా సామాజిక మాధ్యమాల సంస్థలు పూర్తిగా తొలగించే అవకాశం ఉన్నది. ఇలాంటి వార్తలు, వీడియోలు తెలంగాణ అంటువ్యాధుల(కొవిడ్‌-19) నిబంధనలు, విపత్తు నిర్వహణ చట్టం-2005లోని 54వ సెక్షన్‌, ఐపీసీ సెక్షన్‌ 505 కింద ఉల్లంఘనలుగా పరిగణిస్తారు. ఈ చట్టాలే కాకుండా ఇతర నిబంధనలను అనుసరించి ఆ సంస్థలు/సంస్థల యాజమానులు శిక్షార్హులవుతారు.