తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మృతి

ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ తో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందినట్లు వెల్లడించింది. ఇద్దరు గాంధి ఆసుపత్రిలో, ఒకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో, ఒకరు నిజామాబాద్ లో, ఒకరు గద్వాలలో మరణించినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు.
మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నందు వల్ల..ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది. ప్రార్థనల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి మర్కజ్ వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలి. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.