
ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో పని చేస్తున్న శానిటైజేషన్ వర్కర్లు, డాక్టర్లు, నర్సుల పట్ల సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉదార స్వభావం చూపించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా పని చేస్తున్న శానిటైజేషన్ వర్కర్లు, కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, నర్సులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఇస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. శానిటైజేషన్ వర్కర్లు, డాక్టర్లు, నర్సుల సేవలను గౌరవించి.. రూ. కోటి పరిహారాన్ని అందజేస్తామన్నారు. ప్రభుత్వ లేదా ప్రయివేటు సంస్థల్లో పని చేస్తున్న శానిటైజేషన్ వర్కర్లు, డాక్టర్లు, నర్సులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కేజ్రీవాల్.
ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 121కి చేరింది. ఇద్దరు మృతి చెందారు. కరోనా వైరస్ నుంచి 6 మంది కోలుకున్నారు. మర్కజ్ భవనంలో ఉన్న వారిలో 617 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిపోడియా ప్రకటించారు. వీరందరూ వివిధ ఆస్పత్రుల్లో చేరారు. సుమారు 700 మందిని క్వారంటైన్‌లో ఉంచారు ఢిల్లీ అధికారులు. మర్కజ్ భవనాన్ని శానిటైజ్ వర్కర్లు శుద్ధి చేశారు.