
వనపర్తిలో ఓ వ్యక్తిపై పలువురు పోలీసు సిబ్బంది భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇదంతా సదరు వ్యక్తి కొడుకు కళ్లెదుటే చోటుచేసుకుంది. ఘటనను ఓ నెటిజన్ వీడియో తీసి మంత్రి కేటీఆర్‌కు ట్విట్ చేశారు. పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. స్పందించిన కేటీఆర్ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు ప్రవర్తించిన తీరు అంగీకారయోగ్యం కాదన్నారు. ఇటువంటి ఘటనల్లో కఠినంగా వ్యవహరించాల్సిందిగా సూచించారు. ఘటనపై వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు చర్యలు చేపట్టారు. వ్యక్తిపై దాడిచేసిన కానిస్టేబుల్ అశోక్‌కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు.