క‌నుమ‌రుగైన కాలుష్యం.. ప‌ర‌వ‌శిస్తున్న హిమ‌సౌంద‌ర్యం

లాక్‌డౌన్‌తో కోట్లాది మంది జీవ‌నోపాధి కోల్పోయారు. కానీ లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌తో మాత్రం ప్ర‌కృతి ప‌ర‌వ‌శిస్తున్న‌ది. ఎప్పుడూ పరిశ్ర‌మ‌లు, వాహ‌న కాలుష్యంతో నిండిపోయే ఆకాశం ఇప్పుడు తేట‌తెల్ల‌గా క‌నిపిస్తున్న‌ది. దీంతో కొన్ని అరుదైన దృశ్యాలు ప్ర‌జ‌ల‌ను ఆనంద‌భ‌రితుల్ని చేస్తున్నాయి. ఇలాంటి ఘ‌ట‌నే పంజాబ్‌లోని జలంధ‌ర్‌లో జ‌రిగింది. గాలిలో కాలుష్యకార‌కాలు త‌గ్గిపోవ‌డంతో.. జ‌లంధ‌ర్ నుంచి హిమాల‌య ప‌ర్వ‌తాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఆ అద్భుతాన్ని చూసిన స్థానికులు తమ ఆనందాన్ని ట్విట్ట‌ర్‌లో వ్య‌క్తం చేస్తున్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఉన్న దౌలాదార్ ప‌ర్వ‌త‌శ్రేణులు.. అక‌స్మాత్తుగా శుక్ర‌వారం ఉద‌యం క‌నిపించిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు.

వాయు కాలుష్యం త‌గ్గ‌డం వ‌ల్ల .. సుదూరంలో ఉన్న ప‌ర్వ‌తాలు ఆక‌ర్ష‌ణీయంగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం ఇలా క‌నిపించే హిమాల‌యాలు.. ఇప్పుడు హ‌ఠాత్తుగా ద‌ర్శ‌న‌మివ్వ‌డం సంబ‌రానికి గురిచేసిన‌ట్లు సౌమ్యా శ‌ర్మ ట్వీట్ చేసింది. ప్ర‌కృతి ర‌మ‌ణీయంగా ఉన్న‌ద‌ని, మొత్తం హిమాల‌య శ్రేణుల‌ను చూడ‌గ‌లుతున్నామ‌ని ర‌జ‌త్ సైన్ అనే వ్య‌క్తి ట్వీట్ చేశాడు. ఆకాశం క్లీన్‌గా ఉండ‌డం వ‌ల్లే దౌలాదార్ ప‌ర్వ‌తాల‌ను చూడ‌గ‌లుగుతున్న‌ట్లు అమ‌న్ సింగ్ అనే వ్య‌క్తి ట్వీట్ చేశాడు. ఒక్క పంజాబ్‌లోనే కాదు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించ‌డం వ‌ల్ల ప్ర‌కృతి సోయ‌గాలు అంద‌ర్నీ అల‌రిస్తున్నాయి. ఢిల్లీలో వారం రోజుల్లోనే వాయు కాలుష్యం దాదాపు 71 శాతం త‌గ్గింది.