దేశంలో 4 వేలకుపైగా క‌రోనా కేసులు.. 100 దాటిన మ‌ర‌ణాలు

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్త‌రిస్తున్న‌ది. ఈ క‌రోనా ర‌క్క‌సి దాదాపు అన్ని రాష్ట్రాల‌కు పాక‌డంతో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న‌ది. మ‌రోవైపు మ‌ర‌ణాలు కూడా అదేస్థాయిలో పెరుగుతూ ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఢిల్లీలోని మ‌ర్క‌జ్ నిజాముద్దీన్‌లో త‌బ్లిగీ జ‌మాత్ నిర్వ‌హించిన మ‌త ప్రార్థ‌న‌లే దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు విప‌రీతంగా పెరుగుతుండ‌టానికి కార‌ణ‌మ‌య్యాయి. 

దేశ‌వ్యాప్తంగా ఆదివారం ఒక్క‌రోజే 700 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో మొత్తం కేసుల సంఖ్య 4,289కి చేరుకున్న‌ది. మ‌హారాష్ట్ర‌లో అత్యధికంగా 690 క‌రోనా కేసులు నమోదయ్యాయి. త‌మిళ‌నాడు, ఢిల్లీ, తెలంగాణ‌, కేర‌ళ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్ రాష్ట్రాలు ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా 4,289 కేసులు న‌మోదు కాగా అందులో 86 శాతం కేసులు పైన పేర్కొన్న 11 రాష్ట్రాల్లోనే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే మ‌ర‌ణాల సంఖ్య‌ కూడా దేశంలో 100 మార్కును దాటి 118కి చేరింది.