
కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు కూడా తమ వేతనంలో 30శాతం స్వచ్ఛందంగా వదులుకున్నారు. జీతాల్లో కోతకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు.
‘ప్రధాని సహా కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యుల జీతాల్లో ఏడాది పాటు 30శాతం కోత విధించాం. సామాజిక బాధ్యతగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు స్వచ్ఛందంగా వేతనాల కోతకు ముందుకొచ్చారు. రెండేండ్ల పాటు ఎంపీ లాడ్స్‌కు వచ్చే నిధులు రూ.7,900 కోట్లు నిధులు కూడా నిలిపివేశాం. ఎంపీ లాడ్స్‌కు చెందిన నిధులను జాతి నిర్మాణం కోసం వినియోగిస్తాం. 2020 ఏప్రిల్ 1 నుంచి ఏడాది పాటు జీతాల్లో కోత అమలు చేస్తాం. వేతనాల కోత ద్వారా సమకూరిన సొమ్మును కన్సాలిడేటెడ్ ఫండ్‌కు జమ చేస్తామని’ జవదేకర్ పేర్కొన్నారు.