సీఎం కేసీఆర్‌కు రూ. 2 కోట్ల చెక్కు అందజేసిన మంత్రి పువ్వాడ

కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా పలు సంస్థలు, పలువురు ప్రముఖులు సీఎం సహాయనిధికి విరాళాలు అందించారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు చెక్కులు అందజేశారు. సీఎం సహాయ నిధికి వ్యక్తిగత సాయంగా మమత వైద్య విద్య సంస్థల చైర్మన్‌, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌  రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. ఖమ్మం నుంచి వివిధ రంగాల వ్యాపారులు, విద్యా, వైద్య సంస్థలు, వర్తక వ్యాపారులు, కాంట్రాక్టర్లు ముందుకొచ్చి రూ.1.75 మంత్రి పువ్వాడకు   అందజేశారు.   

ఇవాళ ప్రగతి భవన్‌లో రెండు కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ అందించారు.  మమతా వైద్య విద్య సంస్థల తరఫున రూ.25లక్షలు కేటాయించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో కరోనా నియంత్రణ కోసం చేపట్టిన చర్యలను మంత్రి అజయ్‌.. ముఖ్యమంత్రికి వివరించారు.

రూ.5కోట్ల విలువైన మందులు, ఎన్‌95 మాస్క్‌లు అందించేందుకు రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఛైర్మన్‌ సతీష్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ సమ్మతి లేఖ ఇచ్చారు. మరోవైపు రూ.5కోట్ల విలువైన మందులు, ఇతర మెడికల్‌ సామగ్రి అందించేందుకు ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ కూడా ముందుకొచ్చింది.