
ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ ఎంత గట్టిగా పాటిస్తే అంత మంచిది అని సీఎం తెలిపారు. ఇండియాలో జూన్ 3 వరకు లాక్‌డౌన్ పాటించాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చెప్పింది అని సీఎం గుర్తు చేశారు. మన దేశానికి లాక్‌డౌన్ తప్ప వేరే మార్గం లేదు అని ఆయన తేల్చిచెప్పారు. ఏప్రిల్ 15వ తేదీ తర్వాత లాక్ డౌన్ ను పొడిగించాలని ప్రధాని మోదీని కోరుతానని సీఎం పేర్కొన్నారు.
లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా నష్టపోక తప్పదు అని అన్నారు. మన రాష్ర్టానికి రోజుకు రూ. 400 నుంచి రూ. 430 కోట్ల ఆదాయం వస్తుంది. లాక్‌డౌన్ మూలంగా కేవలం రూ. 6 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు సీఎం. ప్రజలను బతికించుకోవాలంటే లాక్‌డౌన్ తప్ప వేరే మార్గం లేదు. ఒక వేళ లాక్‌డౌన్ సడలిస్తే పరిస్థితి ఏంటి? అని సీఎం ప్రశ్నించారు. మళ్లీ గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి వస్తే ఎవరు జవాబుదారీ అని సీఎం అడిగారు. లాక్‌డౌన్ సడలించడమంటే అంత ఆషామాషీ కాదు. ప్రధానితో రోజుకు రెండుసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేనని ప్రధానికి చెప్పాను.
ఇది ప్రపంచానికి వచ్చిన పీడ. ఒక్క కుటుంబానికో, జాతికో రాలేదు. 22 దేశాలు పూర్తిగా 100 శాతం లాక్‌డౌన్ చేశాయి. జపాన్, సింగపూర్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, కొలంబియా, అర్జెంటీనా, నేపాల్‌తో పాటు మరిన్ని దేశాలు మన పద్ధతిలోనే లాక్‌డౌన్ చేశాయి. మరో 90 దేశాలు పాక్షికంగా లాక్‌డౌన్ చేశారు. మన రాష్ట్రం మంచి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సమాజాన్ని బతికించుకున్నామంటే లాక్‌డౌన్, స్వీయ నియంత్రణ వల్లే అయిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ న్యూయార్క్‌ను చూస్తే శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. అలాంటి దుఖం ఎవరికి సంభవించకూడదు. మనమైతే ఆగమయ్యేవాళ్లం. లాక్‌డౌన్ వల్లనే పరిస్థితిని కంట్రోల్ చేశాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.