
కరోనా రోగులకు చికిత్సల కోసం భారతీయ రైల్వే ఇప్పటివరకూ 2500 బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. కరోనా వైరస్‌కు చికిత్సల కోసం 5వేల కోచ్‌లను ప్రత్యేక వార్డులుగా మార్చివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రైల్వేకు నిర్ణీత లక్షం, గడువు పెట్టారు. అయితే ఇప్పటివరకూ ఈ పరిధిలో సగం పనిని రైల్వేశాఖ పూర్తి చేసింది. ఇప్పటికీ పూర్తయిన 2500 ఐసోలేషన్ వార్డులుగా మారే బోగీలతో మొత్తం 40000 ఐసోలేషన్ బెడ్‌లు రోగులకు అందుబాటులోకి వచ్చినట్లు రైల్వేశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రధాని మోడీ ప్రత్యేక సూచనల మేరకు రైల్వేకోచ్‌ను ఐసోలేషన్ వార్డులుగా మార్చే పనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ముందు నమూనా కోచ్‌ను తీర్చిదిద్దారు. దీనికి అధికారిక ఆమోదం దక్కిన తరువాత జోనల్ రైల్వేలలో బోగీలను మార్చే పని చేపట్టారు. సగటున 375 కోచ్‌లను వార్డులుగా మార్చారు. దేశవ్యాప్తంగా 133 చోట్ల ఈ మార్పిడి పని జరిగింది. పూర్తి స్థాయి వైద్య నిపుణుల సలహాల మేరకు ఈ కోచ్‌లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవసరాలు, పద్థతుల ప్రకారం రోగులు ఉండటం, వారికి సరైన వైద్య పరిరక్షణ వంటి పలు జాగ్రత్తలు తీసుకున్నారు.