ఎస్‌బిఐ రుణ రేట్లలో 0.35 శాతం కోత

దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ రుణ రేట్లలో కోతపెట్టింది. అన్నిరకాల కాలపరిమితులకు ఎంసిఎల్‌ఆర్(వడ్డీ రేటు ఆధారిత మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్) 35 బేసిస్ పాయింట్లు (0.35 శాతం) తగ్గిస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి. దీంతో ఏడాది కాలానికి రుణ రేటు 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గనుంది. దీంతో అర్హత కల్గిన గృహ రుణ ఖాతాదారుల ఇఎంఐలు చౌక కానున్నాయని, 30 ఏళ్ల రుణంపై రూ.1 లక్షకు 24 రూపాయలు తగ్గింపు ఉండనుందని ఎస్‌బిఐ వెల్లడించింది. అలాగే అన్ని రకాల డిపాజిట్లపైనా సేవింగ్ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం ద్వారా 2.75 శాతానికి తగ్గనుంది. ఈ కొత్త రేటు ఏప్రిల్ 15 నుంటి అమల్లోకి రానుంది. వ్యవస్థలోకి ద్రవ్యలభ్యతను పెంచే ప్రయత్నంలో భాగంగా ఎస్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది.