
ఒడిశాలో ఏప్రిల్ 30వరకూ లాక్‌డౌన్ పొడిగించారు. గురువారంనాడు మంత్రివర్గ సమావేశం తర్వాత రాష్ట్ర సిఎం నవీన్ పట్నాయక్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ నెల 14తో దేశవ్యాప్త లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో తమ రాష్ట్రంలో 30వరకు దానిని పొడిగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తద్వారా లాక్‌డౌన్‌ను పొడిగించిన తొలిరాష్ట్రంగా ఒడిశా నిలిచింది. తమ రాష్ట్రానికి విమాన, రైలు సర్వీసులను నిలిపివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. జూన్ 17వరకు విద్యా సంస్థలను మూసి ఉంచాలని పట్నాయక్ ఆదేశించారు. వాస్తవానికి ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇప్పటి వరకు అక్కడ 42 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
కరోనా కారణంగా ఒకరు చనిపోయారు. ప్రస్తుత తరుణంలో లాక్‌డౌన్ పొడిగించడం ఒక్కటే పరిష్కారమని భావిస్తున్న నవీన్ పట్నాయక్ ప్రజలను ఇంటినుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. మాస్క్ వాడకం తప్పనిసరి చేశారు. లాక్‌డౌన్ సమయంలో పేదలకు మూడు నెలల రేషన్, నిత్యావసరాలు ముందుగానే అందించాలని అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడిలో భాగంగా వీలైనంత త్వరగా లక్షమందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. నెల 11న ప్రధాని మోడీ రాష్ట్రాల సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. బుధవారం ప్రతిపక్ష నేతలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని లాక్‌డౌన్ ఏకపక్ష ఎత్తివేతకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో లాక్‌డౌన్ కొనసాగింపుపై ఈ నెల 11న ప్రధానితో మాట్లాడాక నిర్ణయం తీసుకోవాలని సిఎంలు భావించారు. అయితే నవీన్ పట్నాయక్ మాత్రం లాక్‌డౌన్ కొనసాగింపు నిర్ణయాన్ని వెంటనే ప్రకటించారు.