
రాష్ట్రంలో మే 4 నుంచి 11 వరకు నిర్వహించే టీఎస్‌ఎంసెట్-2020తోపాటు అన్ని రకాల ప్రవేశపరీక్షలను వాయిదావేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మేలో నిర్వహించాల్సిన తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ, వెటర్నరీ.. ఇతర) కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్), ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్), ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐసెట్), లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్), ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్), పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్), ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) వంటి అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేశామని పేర్కొన్నారు. ఈ పరీక్షల దరఖాస్తుల గడువు తేదీని కూడా మే ఐదు వరకు పొడిగించినట్టు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాలని కోరారు.