మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ : ప్రధాని మోదీ

మే 3వ తేది వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 20 తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పారు. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌ల సంఖ్య తగ్గితే ఆంక్షల సడలింపు ఉంటుందన్నారు. కరోనాపై పోరాటంలో భారత్‌ ముందుకు వెళ్తుందన్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్‌లో కరోనా నియంత్రణలో ఉందన్నారు. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. కొందరికి ఆకలి కష్టాలు ఉండొచ్చు, కొందరికి ప్రయాణాల కష్టాలు ఉండొచ్చు.. కానీ దేశం కోసం అన్ని సహిస్తున్నారని చెప్పారు.

మంగళవారం మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. కరోనాపై పోరులో మన రాజ్యాంగంలోని ప్రబలమైన సామూహిక శక్తిని ప్రదర్శించడం  ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించాం. దేశంలో ఒక్క కేసు ప్రారంభం కాకముందే కఠిన చర్యలు చేపట్టాం. దేశంలో 500 కేసులు ఉన్నప్పుడే 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించాం. వేగంగా నిర్ణయాలు తీసుకుని కరోనా మహమ్మారిని అడ్డుకునే ప్రయత్నం చేశాం. ప్రపంచంలోని పెద్దపెద్ద దేశాలతో పోల్చితే.. మన దేశం పరిస్థితి బాగుంది. ఒకప్పుడు మనదేశంతో సమానంగా ఉన్న దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు 25 రెట్లు ఎక్కువగా ఉన్నాయి’ అని తెలిపారు. 

అత్యవసర విషయాలకు అనుమతులు: మోదీ

ఏప్రిల్‌ 20వ తేదీ నంపచి అత్యవసర విషయాలకు అనుమతులు ఉంటాయని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చిన ముందు ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పుడు ఎలాంటి నిర్లక్ష్యం వహించే పరిస్థితి లేదు. మే 3వ తేదీ వరకు ప్రతీ పౌరుడు సహకరించాలి. ఒక్కరు కూడా కొత్తగా కరోనా బారిన పడకూడదన్నదే లక్ష్యం. గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద తగినంత సాయం అందిస్తున్నాం. అహార వస్తువులు మందులు, ఔషదాల సప్లయ్‌ చైన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తుంటాం. నిత్యవసరాల సప్లయ్‌ చైన్‌కు ఎలాంటి అవరోధం కలగకుండా చర్యలు తీసుంటాం. దేశంలో పేదలు, కూలీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని తెలిపారు.

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు: మోదీ

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర, రాష్ర్టాలు చర్యలు తీసుకుంటాయి. ఆహార వస్తువులు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, మందులు, ఔషదాల సప్లయ్‌ని నిరంతరం పర్యవేక్షిస్తుంటాం. రెండోదశ పరీక్షలో మనం ద్విగుణీకృతంగా పనిచేయాలి. దేశంలో హాట్‌స్పాట్‌లు పెరగకుండా చూసుకోవాలి. ప్రతీ ప్రాంతం, ప్రతీ రాష్ట్రం కరోనా నుంచి కాపాడుకోవడానికి మరింత కఠినంగా వ్యవహరించాలి. లాక్‌డౌన్‌ అమలు విషయంలో కేంద్ర, రాష్ర్టాల మధ్య నిరంతర సంప్రదింపులు, సహాకారం ఉంటుంది.