
లాక్‌డౌన్ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సూపర్‌మార్కెట్లు, మాల్స్ సీజ్‌ల పర్వం కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనసాగిస్తున్న ఎల్‌బినగర్ డిమార్ట్‌ను ఇటీవలే సీజ్ చేసిన జిహెచ్‌ఎంసి ఎన్‌పోర్స్‌మెంట్ విభాగం అధికారలు గురువారం శ్రీనగర్ కాలనీలోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌ను సీజ్ చేశారు. ఈ సూపర్ మార్కెట్‌లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనసాగిస్తున్నరంటూ ఓ సిటిజన్ ఫిర్యాదును అందుకున్న జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తక్షణ అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్కడ సామాజిక దూరం పాటించకపోవడంతో పాటు బిల్ కౌంటర్ వద్ద నిబంధనల మేరకు క్యూలైన్ పాటించకపోవడం, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది గ్లౌసులు ధరించకపోవడం గుర్తించిన అధికారులు కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఈ సూపర్ మార్కెట్‌ను సీజ్ చేశారు. నిత్యావసర వస్తువులు విక్రయించే వ్యాపారులందరూ ఖచ్చితంగా లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని ఇవిఎండి డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి హెచ్చరించారు.