
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మధ్యాహ్నం ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీకానుంది. లాక్‌డౌన్ అమలులో కేంద్రం రేపటి నుంచి పలు మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ సడలింపునకు కేంద్రం నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం విముఖంగా ఉంది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్ర ప్రభుత్వపరంగా ప్రత్యేక నిబంధనలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ను యథాతథంగా అమలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. సీఎం కేసీఆర్ ఈ విషయమై ఇప్పటికే పలు దఫాలుగా మంత్రులు, అధికారులతో చర్చించారు. నేటి మంత్రివర్గ సమావేశం తర్వాత నిర్ణయాన్ని వెలువరించనున్నారు. అదేవిధంగా భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా, కరోనా కట్టడికి మరిన్ని చర్యలు, పరీక్షలు, వైద్య సేవలు, కిట్లు, మాస్కులు, రక్షణ పరికరాల పంపిణీపై మంత్రివర్గం చర్చించనుంది. కంటైన్మెంట్ జోన్లలో అనుసరించాల్సిన వైఖరి, వైద్య సిబ్బంది భద్రతపై, ఏప్రిల్ నెలకు సంబంధించి వేతనాలపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.