
ఎండల దృష్ట్యా అడవులు, వణ్యప్రాణులను రక్షించుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు సూచించారు. అటవీ, దేవాదాయశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అడవుల్లో కార్చిచ్చు నివారణకు పటిష్ట కార్యాచరణ చేపట్టాలని, అగ్ని ప్రమాదాల నివారణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని, సోలార్ బోర్లతో గుంతలు, చెక్‌డ్యామ్‌లు, సాసర్ల పిట్స్‌లో నీరు నింపాలని సూచించారు.
జూపార్క్‌లు, కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో జంతువులు అనారోగ్యం బారినపడకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని, జూలోని జంతువులకు సురక్షితమైన ఆహాన్ని అందించాలన్నారు. బ్లాక్, అవెన్యూ ప్లాంటేషన్లలో మొక్కలకు నీటి కొరత లేకుండా చూడాలన్నారు. అందులో పనిచేసే కూలీలకు ఆహారం సరఫరా చేయాలని సూచించారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు, వలస కూలీలు, నిరాశ్రయులెవరూ ఆకలితో ఉండకూడదని వారికి ఆలయాల్లో అన్న ప్రసాదాలు చేయించి పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు.