తెలంగాణలో14 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఇద్దరు మృతి

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో మరో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం  కేసుల సంఖ్య 872కు చేరింది. తాజా కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 12, మేడ్చల్‌లో ఒకటి, నిజామాబాద్ జిల్లాలో మరో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం ఇద్దరు మరణించడంతో వైరస్‌ బారినపడి మృతి చెందినవారి సంఖ్య 23కు చేరుకుంది. 186 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 677 గా ఉంది. ఇక కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర  ప్రభుత్వం.. వైరస్‌ వ్యాప్తి తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.