తెలంగాణలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం అనురిస్తోంది. కరోనా నియంత్రణ చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలు అవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు బుధవారం నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు జిల్లాల్లో పర్యటనకు బయల్దేరారు. వీరు స్యూరాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించి, స్వయంగా పరిశీలన చేయనున్నారు.
సూర్యాపేటలో సీఎస్ సోమేశ్ కుమార్ , డీజీపీ పర్యటన
ముందుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు సూర్యాపేట చేరుకున్నారు. జిల్లాలో కరోనా మహమ్మారి విస్తరణపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి కట్టడి చర్యలు చేపట్టన్నారు. ఇందులో భాగంగా సూర్యాపేటలో పలు ప్రాంతాల్లో అధికారులు పర్యటించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే జిల్లాలో 26 కేసులు నమోదు కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 80కి చేరింది. ఇప్పటికే జిల్లాలో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.