సూర్యాపేట జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి అక్కడికి వెళ్లారు. ముఖ్యమత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హై లెవల్ టీమ్‌గా క్షేత్రస్థాయిలో సందర్శిస్తున్నామన్న డీజీపీ.. జిల్లా అధికార యంత్రాంగానికి మరింత సపోర్ట్ ఇవ్వడానికే తాము వచ్చామని చెప్పారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని, సూర్యాపేట జిల్లాలో కూడా త్వరలోనే కరోనా మహమ్మారిని కట్టడి చేస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
కంటైన్‌మెంట్ జోన్లలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. కంటైన్‌మెంట్ ఏరియాల్లోకి బయటివారు రాకుండా.. లోపలివారు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్‌లో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలని జిల్లా ప్రజలను కోరారు. అన్నీ శాఖలకు సహాయ సహకారాలు అందిస్తూ పోలీస్ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పని చేస్తుందని డీజీపీ చెప్పారు.