బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ (54) ఇకలేరు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బుధవారం ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాటం చేస్తున్న ఈ నటుడు కొన్నాళ్లు లండన్‌లో చికిత్స కూడా తీసుకున్నాడు. ఈ మధ్యే భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన ఆంగ్రేజీ మీడియం సినిమాలో నటించారు. మంగ‌ళవారం ఇర్ఫాన్ మరోసారి అనారోగ్యానికి గురికావ‌డంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుప‌త్రికి తర‌లించారు. చికిత్స పొందుతూ బుధవారం క‌న్నుమూశారు.

ఈ నెల 25న  ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం మృతి చెందిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు. కన్నతల్లి మరణించిన  నాలుగైదు రోజులకే ఇర్ఫాన్‌  మృతి చెందండం బాలీవుడ్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకుంది.

ఇర్ఫాన్‌కు భార్య సుతాపా సిక్దార్‌, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇర్ఫాన్‌ బాలీవుడ్‌ సినిమాలే కాకుండా స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. గతంలో ఈయన నటించిన పాన్ సింగ్ తోమర్ సినిమాకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’. తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు.