భారత్‌లో పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నా పాజిటివ్‌ కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడంలేదు. కేసులతో పాటు పెద్ద ఎ‍త్తున ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1718 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 66 మంది మృత్యువాత పడ్డారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,050కి చేరగా.. మృతుల సంఖ్య  1,074కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు మహారాష్ట్రలో వైరస్‌ విజృంభిణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9,915 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 432 మరణాలు సంభవించాయి.

ఇక గుజరాత్‌లోనూ అదే తీవ్రత కనపడుతోంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4082కి చేరగా.. 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య భారతంలో కోవిడ్‌ కేసుల సంఖ్య కొంతమేర తగ్గముఖం పట్టడం ఊరటనిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కేవలం ఒక్కో కేసు మాత్రమే నమోదు అయ్యాయి. దేశంలో మొత్తం కరోనా వైరస్‌ బాధితుల్లో కేవలం 0.33 శాతం మంది వెంటిలేటర్లపై ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ చెప్పారు. 1.5 శాతం మంది ఆక్సిజన్‌ సపోర్టుపై ఉన్నారని, 2.34 శాతం మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారన్నారు.