తెలంగాణ రాష్ట్రం లో సోమవారం కొత్తగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరంతా గ్రేటర్ హైదరాబాద్‌లోనివారే కావడం గమనార్హం. దీంతో కేసుల సంఖ్య 1,085కు చేరింది. 40 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 29 మంది మృతి చెందగా, 585 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు. మిగిలిన 471 మంది చికిత్స పొందుతున్నట్టు ప్రజారోగ్యశాఖ బులెటిన్ విడుదలచేసింది.
సామాజికవ్యాప్తి లేదు
రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి చెందలేదని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ రాజారావు స్పష్టంచేశారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయన్నారు. కాంటాక్ట్‌లను గుర్తించడంలో కొంత ఆలస్యమవుతుందేమో కానీ ఇప్పటికైతే అన్ని కేసులు ట్రేసవుతున్నాయని తెలిపారు.
నేటి నుంచి ఈఎస్ఐలో వైద్యసేవలు
కరోనా నేపథ్యంలో ఈఎస్ఐ దవాఖానలో తగ్గించిన వైద్యసేవలను మంగళవారం నుంచి కొనసాగించాలని ఎం ప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జాతీయ కార్యాలయం నుంచి సోమవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఈఎస్ఐ దవాఖాన సూపరింటెండెంట్‌కు లేఖ ను పంపింది.
బిడ్డ నుంచి తల్లికి..
వరంగల్ రెడ్డికాలనీ: వరంగల్ అర్బన్ జిల్లాలో బిడ్డ నుంచి తల్లికి కరోనా సోకింది. ఇటీవల హన్మకొండ మండ లం పూరిగుట్టతండాలో ఆర్మీ జవాన్ కుమార్తె (10)కు పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాపను హైదరాబాద్‌కు తరలించే సమయంలో తల్లి కూడా వెంట వెళ్లింది. అక్కడ కుమార్తెను తరుచూ చూసుకొనే సందర్భంలో వైద్యులు తల్లి నమూనాలను సేకరించి పరీక్షించగా ఆమెకు కూడా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యులు చికిత్స అందిస్తున్నా రు. ఆ తల్లి 15 రోజులుగా కుమార్తెతో గాంధీలోనే ఉండటంతో ఈ కేసును జీహెచ్ఎంసీ కింద జమకట్టారు.