రైతుబంధుకు రూ.7 వేల కోట్లు
రుణమాఫీకి రూ.1200 కోట్లు విడుదల
రైతు రుణమాఫీ, పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు నిధుల విషయమై ఈ రోజు రాష్ట్ర ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆద్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా 6.10 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. రూ.25 వేలు నుంచి రూ.లక్ష లోపు ఉన్న రుణాలకు నాలుగు విడతలుగా చెల్లింపులు చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
రాబోయే వానాకాల పంటకు రైతుబంధు పథకం కోసం రూ.7 కోట్లు విడుదల చేసారు. ఈ ఏడాది కోటీ 40 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు చెల్లించామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రూ. 25 వేల లోపు రైతు రుణాల ఏకమొత్తం మాఫీ కింద రూ.1200 కోట్లు విడుదల చేసింది ఆర్థిక శాఖ. సీఎం కేసిఆర్ కేబినెట్‌లో నిర్ణయించిన ప్రకారం రైతుబంధు కింద రూ. 7 వేల కోట్లను పంట సీజన్ ప్రారంభం నాటికే రైతులకు అందిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. వానాకాల పంటకు విడుదల చేసిన రైతు బంధు మొత్తాన్ని రాష్ట్రంలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో వెంటనే జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.